పలు ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నంకు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఈ ఉదయం నగరంలోని పార్టీ కార్యాలయంలో 77వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, వారి సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించారు.
స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో 40 ఏళ్లుగా నడుస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తెలిపారు. పెండింగ్ జీతాలు విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ సిబ్బందికి స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం తన తండ్రికి మంజూరు చేసిన ఇంటిని స్థానికంగా దివకాల గంగారాజు ఆక్రమించుకున్నాడని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విశాఖ అంబేద్కర్ కాలనీకి చెందిన ఈర్ల అప్పలరాజు కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్ వాలిడేషన్ స్కీమ్‌ను ఆర్టీసీ సిబ్బందికి కూడా వర్తింపజేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల వివేక్ తనపై మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు (కన్నబాబు) ప్రోత్సాహంతో నమోదు చేసిన రౌడీషీట్‌ను రద్దు చేయాలని కోరారు.
ప్రతీ అభ్యర్థనను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు
