పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం పవిత్రమైనదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భూమి రైతులకు అత్యంత భావోద్వేగ అంశమని, ప్రాణం పోయినా భూమిని కోల్పోవడానికి వారు సిద్ధపడరని పేర్కొన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని గుర్తు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములపై జగన్ ఫొటో వేయడాన్ని తప్పుబట్టిన సీఎం, ఆ చర్య వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకపోతే రైతుల భూముల పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలోనే “మీ భూమి.. మీ హక్కు” అని హామీ ఇచ్చామని, రాజముద్రతో కొత్త పాస్‌బుక్‌లు ఇస్తామని చెప్పిన మాటను ఇప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు.
భూసంబంధిత సమస్యలు రాకుండా గ్రామసభలు నిర్వహించి, పూర్తిస్థాయి సరిదిద్దులు చేసిన తర్వాతే పాస్‌బుక్‌లు ఇస్తున్నామని చెప్పారు. భూరికార్డులను బ్లాక్‌చెయిన్‌లో భద్రపరచడం వల్ల ఎవరూ మార్పులు చేయలేరని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయని వివరించారు. గతంలో 1.18 లక్షల పాస్‌బుక్‌లలో ఉన్న లోపాలను సరిచేస్తున్నామని తెలిపారు.
అవినీతి లేకుండా పని చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం, ఈ నెల 11 వరకు పాస్‌బుక్‌ల పంపిణీ కొనసాగుతుందని, వచ్చే నెలలో మరోసారి సర్వే చేసి జీరో మిస్టేక్స్‌తో కొత్త పాస్‌బుక్‌లు ఇస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం సర్వే రాళ్లపై ఫొటోల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని విమర్శించారు.
సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని, ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ధాన్యం రైతులకు 24 గంటల్లో నగదు చెల్లింపులు చేస్తున్నామని, మెగా డీఎస్సీని అనేక అడ్డంకులు దాటుకుని పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, అది పూర్తైతే నీటి సమస్యలు తీరుతాయని సీఎం స్పష్టం చేశారు.
ప్రజలు చిన్నచిన్న వివాదాలకు దూరంగా ఉండాలని, మంచి–చెడుల మధ్య తేడా గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు
