ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే మా తొలి ప్రాధాన్యత.. ఎమ్మెల్యే దగ్గుపాటి
అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం
టీడీపీ వారిపై కక్ష గట్టి పింఛన్లు, ఇతర పథకాలు ఆపారాన్న ఎమ్మెల్యే
ప్రతి శుక్రవారం మీకోసం అందుబాటులో ఉంటాం.. ప్రజా దర్బార్ కార్యాలయంలో మీరు ఇచ్చే అర్జీకి తాము పరిష్కారం చూపిస్తామని.. ప్రజలకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరితో ఆయన ఓపిగ్గా మాట్లాడుతూ అర్జీలు స్వీకరించారు. ఇందులో ముఖ్యంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల పట్టాలు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సమస్యలపై ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి పరిష్కారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 765అర్జీలు రాగా.. ఇందులో 644 సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. మరో 87అర్జీల పరిష్కారం కోసం అధికారులు పని చేస్తున్నారన్నారు. ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని.. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమతో చెప్పవచ్చన్నారు. ప్రజలకు బాధ్యతగా పని చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ సానుభూతిపరులకు సంబంధించిన పింఛన్లు ఇతర ప్రభుత్వ పథకాలు రద్దు చేశారన్నారు. దీనిపై ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం చూపలేదన్నారు. కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే వీటిని మళ్లీ పునరుద్ధరిస్తున్నామన్నారు. రాష్ట్రంతో పాటు అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఐదు సంతకాలు కీలకమైన హామీల పై చేశారన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని.. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ఎంతో మంది పరిశ్రమల స్థాపన కోసం ముందుకొచ్చారన్నారు. 16లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరుగుతోందని.. ఇప్పటికే 130కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. 30ఏళ్లుగా ప్రజలకు ఇబ్బందిగా ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను క్లియర్ చేసి అక్కడ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు పి ఎల్ ఎన్ మూర్తి, పోతుల లక్ష్మీనరసింహులు, పరమేశ్వర్, టిడిపి నాయకులు కోణంకి గంగారం, సుధాకర్ యాదవ్, సరిపూటి రమణ, ఫిరోజ్ అహ్మద్, సాకే లక్ష్మీనరసింహ, నెట్టెం బాలకృష్ణ, మోహన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
