నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలిరోజు 20 గంటలపాటు దర్శనం..

వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు.. తిరుమల క్షేత్రం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. సప్తగిరులంతటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ, కోట్లాది భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది.
నేటి అర్ధరాత్రి తర్వాత స్వామివారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారం భక్తుల దర్శనార్థం తెరుచుకోనుంది. ముందుగా వీఐపీల దర్శనం పూర్తయ్యాక, ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది పది రోజుల పాటు, అంటే జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కొనసాగించనున్నారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు..

భక్తుల రద్దీని నియంత్రించేందుకు, టైం స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. భక్తులు తమకు కేటాయించిన టైం స్లాట్‌ను బట్టి కృష్ణతేజ, ఎటిజిహెచ్ శిలాతోరణం మార్గాల ద్వారా ఆలయానికి ప్రవేశం కల్పించనున్నారు. మొదటి మూడు రోజులు టైం స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఆ తర్వాత జనవరి 2 నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది.

తిరుమల ఆలయం అద్భుతంగా..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయం అద్భుతంగా ముస్తాబైంది. సప్తగిరులు మరింత సుందరంగా కనిపించేలా 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 లక్షల కట్ ఫ్లవర్స్‌తో అలంకరణ చేపట్టారు. ఆలయం ముందు భాగంలో రంగనాథ స్వామి ఆలయ నమూనాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా, భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేలా అలంకరణ సాగింది.
తొలిరోజు ప్రత్యేకంగా 20 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. భక్తులు ఎక్కువసేపు స్వామివారి దర్శనం చేసుకునేలా సిబ్బందిని, వాలంటీర్లను పెద్ద సంఖ్యలో నియమించారు. భద్రతా పరంగా పోలీస్, హోంగార్డ్, సీసీటీవీ నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేశారు.

భక్తుల కోసం అన్నప్రసాదములు..

భక్తుల కోసం అన్నప్రసాద ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేశారు. పులిహోర, దద్దోజనం సహా 16 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలు నిరంతరం పనిచేయనున్నాయి. లడ్డూ ప్రసాదాల తయారీలో కూడా రికార్డు స్థాయి ఏర్పాట్లు జరిగాయి. రోజుకు సుమారు 4.40 లక్షల లడ్డూలు తయారు చేసి భక్తులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.

భక్తిశ్రద్ధలతో కూడిన వాతావరణం..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల అంతటా భక్తిశ్రద్ధలతో కూడిన వాతావరణం నెలకొంది. సకల సౌకర్యాలు, క్రమబద్ధమైన దర్శన వ్యవస్థతో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి మరింత శాంతియుతంగా, భక్తి పారవశ్యంతో సాగనుందని టీటీడీ అధికారులు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe