- ప్రజాప్రతినిధులు చొరవ చూపకుంటే వెనుకబాటు తప్పదు
- ‘కోడూరు’ను రెవెన్యూ డివిజన్ చేయకుంటే ఉద్యమం పునరావృతం
- ‘చిట్వేలి జేఏసీ’ నేత ఇంతియాజ్ అహ్మద్ విశ్లేషణాత్మక హెచ్చరిక
చిట్వేలు, జనవరి 06: ఎల్లో సింగం ప్రతినిధి
తిరుపతి జిల్లాలో విలీనమైన చిట్వేలి, పెనగలూరు వంటి మారుమూల మండలాలు ఇకనైనా అభివృద్ధి పథంలో పయనిస్తాయా? లేక ఆధ్యాత్మిక రాజధాని అనే మహాసముద్రంలో మా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా? అని చిట్వేలి మండల జేఏసీ సభ్యులు, సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ భౌగోళిక మార్పులు, అభివృద్ధి అవకాశాలు మరియు ప్రజాప్రతినిధుల బాధ్యతపై ఆయన విశ్లేషణాత్మక ప్రకటన విడుదల చేశారు.
చరిత్రలో పౌరుషం.. అభివృద్ధిలో శూన్యం!
చరిత్ర పుట్టినప్పటి నుండి కడప జిల్లాలో భాగమైన మా ప్రాంతం, పేరుకు పౌరుషాల గడ్డ అనిపించుకున్నా అభివృద్ధిలో మాత్రం ఎప్పుడూ వెనుకబడే ఉందని ఇంతియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి రాజకీయ స్వలాభాల కోసం రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. “అన్ని విధాల అర్హతలు ఉండి, ప్రభుత్వ భూములు మెండుగా ఉన్న మదనపల్లి లేదా రాజంపేటను జిల్లా కేంద్రాలుగా చేసి ఉంటే బాగుండేది. కానీ రాజు చేతిలో కలం ఉన్నప్పుడు నిమిత్తమాత్రులమైన ప్రజలు చేసేదేమీ లేకపోయింది” అని వ్యాఖ్యానించారు.
తిరుపతి జిల్లాలో చేరడంపై మిశ్రమ స్పందన
రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎంతో ఆశగా పోరాటాలు చేశామని, తీరా ఇప్పుడు తిరుపతి జిల్లాలో విలీనం కావడం ఒక విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి జిల్లాలో చేరడం వల్ల, అక్కడ ఉన్న టీటీడీ నిధులు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు, కర్మాగారాలు మరియు అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రులలో మా ప్రాంత యువతకు స్థానిక రిజర్వేషన్లు లభిస్తాయని ఆశలు చిగురించాయని తెలిపారు. అయితే, ఇప్పటికే అభివృద్ధి చెందిన తిరుపతి నగరం ముందు, మా చిట్వేలి, పెనగలూరు మండలాలకు తగిన న్యాయం జరుగుతుందా? లేదా అనేది అనుమానంగా ఉందని పేర్కొన్నారు.
వనరులు మెండు.. ఉపాధి ఎక్కడ?
రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన సంపద అపారమని ఇంతియాజ్ గుర్తు చేశారు. ఏటా సుమారు రూ. 700 కోట్లకు పైగా వ్యాపారం సాగే పండ్ల తోటలు, మార్కెట్ యార్డులు మన దగ్గర ఉన్నాయి.మంగంపేట బైరటీస్ నిక్షేపాలు మరియు ఎర్రచందనం వంటి సహజ వనరులు మన సొంతం. “ప్రజాప్రతినిధులు చొరవ చూపి, పండ్ల ద్వారా తయారయ్యే జ్యూస్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు (గల్ఫ్) వలస వెళ్తున్న నిరుపేదలకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది” అని ఆయన సూచించారు.
అంతిమ డిమాండ్: రెవెన్యూ డివిజన్
రైల్వే కోడూరును తక్షణమే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు మండలాలకు కలిపి డివిజన్ కేంద్రం లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. నూతన జిల్లాల ఏర్పాటులో నాలుగు మండలాలు ఉన్న నియోజకవర్గాలను కూడా డివిజన్లుగా మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. “ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలను గుర్తించి, వారి పక్షాన నిలబడాలి. అప్పుడే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. లేనిపక్షంలో ఉద్యమాలు పునరావృతం కాక తప్పదు” అని ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.
