- మహిళలు, గృహిణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
- అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
చిట్వేలు, జనవరి 05: ఎల్లో సింగం ప్రతినిధి
చిట్వేలు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. తన పేరు వహీద్ ఖాన్ అని, పుల్లంపేట సమీపంలోని అప్పారాజుపేట తన స్వగ్రామమని చెప్పుకుంటున్న సదరు వ్యక్తి ప్రవర్తనపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-అనుమానాస్పద ప్రవర్తన
ముఖ్యంగా ఉదయం వేళల్లో ఈ వ్యక్తి వీధుల్లో తిరుగుతూ, ఇళ్ల గేట్లు తెరిచి ఉంటే లోపలికి తొంగి చూడటం, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి పనులు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. సోమవారం ఉదయం కొత్త బస్టాండ్ ప్రాంతంలో సంచరిస్తుండగా, గమనించిన కొందరు యువకులు అతడిని గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి పంపించివేశారు.
-గృహిణులకు ప్రత్యేక సూచన
తెల్లవారుజామున ఇళ్ల ముందు ముగ్గులు వేసే సమయంలో మరియు శుభ్రం చేసుకునే సమయంలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని గ్రామ పెద్దలు సూచించారు. గేట్లకు తాళాలు వేసుకోవాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు పదేపదే కనిపిస్తే అప్రమత్తం కావాలని కోరారు.
-పోలీసులకు సమాచారం ఇవ్వండి
గ్రామ భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకముందే అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా గ్రామ పెద్దలకు సమాచారం అందించాలని చిట్వేల్ గ్రామస్తులు కోరుతున్నారు.
