క్రీడలకు రాష్ట్రాలు, ప్రాంతాలు అనే సరిహద్దులు లేవని, క్రీడా ప్రతిభే ఒక క్రీడాకారుడికి అసలైన గుర్తింపునిస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని పెదబోండపల్లిలో నిర్వహించిన సియువి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఫైనల్ పోటీ పెదబోండపల్లి, రాయగడ జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి పెదబోండపల్లి జట్టు విజేతగా నిలిచి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ, సియువి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు, వారి జ్ఞాపకాలను నిలుపుకోవడానికే ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్తులో ఈ టోర్నమెంట్ను మరింత ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాయగడ జట్టు క్రీడాకారులు ఎంతో అద్భుతంగా ఆడారని ప్రశంసిస్తూ, వారిని కూడా మన క్రీడాకారులుగానే భావిస్తున్నామని తెలిపారు. అందుకే క్రీడలు సరిహద్దులను తుడిచివేస్తాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం విజేతలకు, పాల్గొన్న క్రీడాకారులకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర బహుమతులు అందజేసి అభినందించారు.
