మాచర్ల: నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ యువ నాయకుడు జూలకంటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక 13వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు భూమిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాచర్ల ప్రాంతం అభివృద్ధి దిశగా దృఢంగా ముందుకు సాగుతోందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సారథ్యంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ద్వారా సుమారు రూ.124 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, స్థానికుల సహకారం ఎంతో కీలకమని గౌతమ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
