ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన రెండు కీలక సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చర్చ అనంతరం సభ్యుల సమ్మతితో బిల్లులు ఆమోదం పొందాయి. భవన నిర్మాణ సమయంలో ఖాళీ స్థలం పన్నును 50 శాతం మాత్రమే చెల్లించేలా చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. ఈ నిర్ణయం నిర్మాణ దశలో బిల్డర్లపై పడే వ్యయభారాన్ని తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నదని మంత్రి వివరించారు.
అదేవిధంగా, మున్సిపల్ చట్టాల్లో ఉన్న “లెప్రసీ” పదాన్ని తొలగించే సవరణ బిల్లుకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. సమాజంలో అనవసర అపార్థాలు, అవమాన భావనలను నివారించేందుకు ఈ మార్పు అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించే దిశగా మున్సిపల్ చట్టాల్లో పలు సవరణలు చేపట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. బిల్డర్లను ప్రోత్సహించడం, నిర్మాణ రంగంలో పారదర్శకత పెంపు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టామని చెప్పారు. తాజా సవరణలతో నిర్మాణ రంగానికి ఊరట లభించనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
