శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనవిజయం: బోర్డు సభ్యుడు బోడేపూడి హర్షం

శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించబడినట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, ఉత్సవాల సమయంలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని వెల్లడించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, దర్శన, అన్నదానం, భద్రత తదితర ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించామని, అందించిన సేవలపై భక్తుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఆలయ అధికార యంత్రాంగం, సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో పనిచేశారని అభినందించారు.

ఉత్సవాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి స్వయంగా పాల్గొని భక్తులకు మెరుగైన సేవలు అందించామని చెప్పిన బోడేపూడి, ఈ మహోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైలంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచాయని ఆయన అన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe