జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కుప్పం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల మరియు టైలర్ హై స్కూల్‌లలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి కుప్పం నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాకీర్ అహ్మద్ మాట్లాడుతూ, నులిపురుగుల నివారణ మనందరి సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు.
నులిపురుగుల వల్ల పిల్లల శరీర ఎదుగుదల మందగించడమే కాకుండా రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. చెప్పులు లేకుండా నడవడం, మట్టిలో ఆడటం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాల వల్ల పిల్లల శరీరంలో నులిపురుగులు ఏర్పడతాయని వివరించారు. ఇవి పేగుల్లో నివసిస్తూ రక్తాన్ని పీల్చుకుంటాయని చెప్పారు.
నులిపురుగుల నివారణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మరిగించి చల్లార్చిన నీటిని తాగడం, పండ్లు–కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం, తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం వంటి అలవాట్లు అవలంబించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
