చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న మంగళగిరిలోని నేతన్న సర్కిల్ వద్ద నిర్వహించనున్న “చేనేత గర్జన”ను విజయవంతం చేయాలని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాత రేపల్లె తాలూకా పరిధిలో చేనేత సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించేందుకు కరపత్రాల పంపిణీతో పాటు ఇంటింటా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా కమిటీ నాయకులు గొట్టుముక్కల బాలాజీ, మురుగుడు సత్యనారాయణ, కౌతరపు సీతారామయ్యలు మాట్లాడుతూ, వస్త్ర నాగరికతకు చిరస్థాయిగా వన్నెతెచ్చిన చేనేత పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల విధానాల వల్ల చేనేత కుటుంబాల జీవనోపాధి క్షీణిస్తోందని, ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందని అన్నారు.
చేనేతలకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీలను తక్షణమే అమలు చేయాలని, సహకార సంఘాలకు పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 11 రకాల చేనేత వస్త్రాలపై రిజర్వేషన్ యాక్ట్ అమలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో జాప్యం నివారణ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ రక్షణ, చేనేతల సంక్షేమం కోసం జరిగే చేనేత గర్జనలో పెద్ద ఎత్తున పాల్గొని గళమెత్తాలని పిలుపునిచ్చారు.
