విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఉన్న బెహరా ఆసుపత్రిలో కె. వెంకట్రావు (65) మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక పత్రికలను పంపిణీ చేస్తూ జీవనం సాగిస్తున్న వెంకట్రావు, ద్విచక్ర వాహనం నుంచి జారిపడి కాలికి గాయమవడంతో ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థోపెడిక్ వైద్యుడు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని సూచించగా బంధువులు అంగీకరించినట్లు సమాచారం.
సోమవారం శస్త్రచికిత్సకు తీసుకెళ్లిన అనంతరం మత్తుమందు ఇచ్చిన తర్వాత శరీరం సహకరించడం లేదని వైద్యులు తెలిపారని, కొద్ది సేపటికే మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మత్తుమందు మోతాదు, అనస్థీషియా వైద్యుడి అర్హతలపై సందేహాలు వ్యక్తం చేస్తూ, నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఫిర్యాదు స్వీకరణలో ఆలస్యం జరిగిందని ఆరోపణలు వినిపించినప్పటికీ, అనంతరం గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చూరికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
