ఏప్రిల్‌ 1 నుంచి ఐటీ ఫారాలకు కొత్త పేర్లు.. వేతన జీవులకు కీలక మార్పులు

వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులకు సుపరిచితమైన ఫారం-16, ఫారం-26AS వంటి ఆదాయపు పన్ను పత్రాలకు త్వరలో కొత్త పేర్లు రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో ముసాయిదా నిబంధనల్లో ఈ మార్పులు ప్రతిపాదించబడ్డాయి. దీని ప్రకారం, ఉద్యోగుల టీడీఎస్‌, వేతన వివరాలు పొందుపరిచే ఫారం-16ను ఇకపై ఫారం-130గా వ్యవహరించనున్నారు. వార్షిక ఆదాయం, పన్ను మినహాయింపుల సమగ్ర వివరాలు చూపే ఫారం-26ASకు ఫారం-168 అనే పేరు ఇవ్వనున్నారు.

అదేవిధంగా, ఫారం-16Aను ఫారం-131, ఫారం-24Qను ఫారం-138, ఫారం-26Qను ఫారం-140గా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మార్పులు పత్రాల నిర్మాణంలో కాకుండా ప్రధానంగా పేర్ల పరంగా ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కొత్త చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత ఫారాలు చెల్లుబాటు అవుతాయి. 2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పేర్లు అధికారికంగా అమల్లోకి రావచ్చని అంచనా.

ప్రస్తుతం ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. తుది నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే ఖచ్చితమైన అమలు తేదీలు స్పష్టత పొందనున్నాయి. పేర్ల మార్పు వల్ల ప్రారంభంలో కొంత గందరగోళం ఉన్నా, క్రమంగా పన్ను చెల్లింపుదారులు అలవాటు పడతారని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మార్పులు డిజిటల్‌ పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా తీసుకురాబడ్డాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

WhatsApp Join Now
Youtube Subscribe