మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గుండలకోన క్షేత్రానికి భారీగా తరలివచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చిట్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సల్మా ఆదేశాల మేరకు, హెల్త్ సూపర్వైజర్ ఇస్మాయిల్ బాషా పర్యవేక్షణలో ప్రారంభమైంది. శివరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
అటవీ మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు పాద గాయాలు, అలసట, జ్వరం, చిన్నపాటి అనారోగ్య సమస్యలకు తక్షణ చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వారికి ఆయింట్మెంట్లు రాసి కట్లు కట్టడంతో పాటు ఉచిత మందులను పంపిణీ చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. భక్తులు ఎటువంటి అస్వస్థతకు గురైనా ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని వైద్య బృందం సూచించింది. కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి హరిత, ఏఎన్ఎంలు మాధవి, రాజమ్మ, రమణమ్మ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని సేవలు అందిస్తున్నారు.
