PMMSY – సాగరమాల తోడ్పాటుతో హార్బర్ల ఆధునీకరణకు వేగం – అసెంబ్లీలో అచ్చెన్నాయుడు వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి 13: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY), సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కోస్తా ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

రాష్ట్రానికి 12 కోస్తా జిల్లాల్లో 1053.07 కి.మీ తీరప్రాంతం ఉండగా, 350 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు గుర్తించబడ్డాయని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టినట్లు, తొలి దశలో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, వోడరేవు హార్బర్లు ప్రతిపాదనలో ఉన్నాయని చెప్పారు.

PMMSY, సాగరమాల, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సహకారంతో విశాఖ హార్బర్ ఆధునీకరణ పనులు రూ.178.51 కోట్లతో కొనసాగుతున్నాయని, కాకినాడ హార్బర్ అభివృద్ధికి DPR సిద్ధం చేయడానికి CICEF అంగీకరించిందని వివరించారు. అలాగే రూ.126.91 కోట్లతో దొండువాక, ఉప్పలంక, భీమిలి తదితర ప్రాంతాల్లో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి టెండరింగ్ దశలో ఉందన్నారు.

పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం మినీ జెట్టీ నిర్మాణంపై ప్రజల అభ్యర్థన మేరకు CICEF ద్వారా ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనాలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. తుది నివేదికలు అందిన వెంటనే సాంకేతిక సాధ్యత ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోస్తా ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe