తిరుపతిలోని తుడా కార్యాలయంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో సభ్యుడు, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆర్టీసీ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తిరుపతి మంగళం ఆర్టీసీ రీజనల్ డిపో మేనేజర్ సురేంద్ర కుమార్ మరియు అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి కె. సంధ్య పాల్గొన్నారు. మంగళం ఆర్టీసీ డిపోకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారు విస్తృతంగా చర్చించారు.
ప్రధానంగా డిపో డెవలప్‌మెంట్ మరియు బ్యూటిఫికేషన్ పనుల నిమిత్తం తుడా సహకారం అందించాలని కోరుతూ అధికారులు వినతి పత్రాన్ని సమర్పించారు. డిపో పరిసరాలను మరింత శుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనుల వివరాలను ఛైర్మన్‌కు తెలియజేశారు. ప్రయాణికులు మరియు సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి అత్యవసరమని వారు ప్రస్తావించారు.
వినతిపై సానుకూలంగా స్పందించిన డాలర్స్ దివాకర్ రెడ్డి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళం డిపో అభివృద్ధికి తుడా తరఫున సహకారం అందించేందుకు సాధ్యమైన మార్గాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.
