కడ కార్యాలయంలో వార్డు ప్రజలు, సిబ్బందితో అవగాహన కార్యక్రమం
ఎల్లోసింగం, కుప్పం: స్వచ్ఛ్ కుప్పం కార్యక్రమంలో భాగంగా కుప్పం కడ కార్యాలయం నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కడ పిడి వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో జరగగా, వివిధ వార్డులకు చెందిన ప్రజలు, సానిటరీ సిబ్బంది, మెప్మా సిబ్బంది విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నెట్ జీరో లక్ష్య సాధనలో భాగంగా పట్టణంలో చెత్త ఉత్పత్తి ఎలా జరుగుతుందో, దానిని ఎలా సేకరిస్తున్నారో, ఎలాంటి విధానాల్లో చెత్తను శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారో వివరించారు. ముఖ్యంగా ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. పట్టణ పరిశుభ్రతను కాపాడడంలో ప్రజల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కడ పిడి వికాస్ మర్మత్ సూచించారు. చెత్త సేకరణ వాహనాలకు సహకరించడం, నిబంధనలకు విరుద్ధంగా చెత్తను రోడ్లపై వేయకుండా ఉండడం ద్వారా నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. అలాగే స్వచ్ఛత కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని పేర్కొన్నారు. సానిటరీ సిబ్బంది, మెప్మా సిబ్బంది సమన్వయంతో కుప్పం పట్టణాన్ని మరింత పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు ప్రజలు స్వచ్ఛతపై అవగాహన పెరిగిందని, మున్సిపాలిటీ చేపడుతున్న చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
