ఉప్పులూరి గ్రామ పరిధిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో బాధితులకు న్యాయం చేస్తామని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ భరోసా ఇచ్చారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ఆయన తోట్లవల్లూరు చేరుకుని 11 మంది బాధితులను పరామర్శించారు. వారి వాంగ్మూలాలను స్వీకరించి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
బాధితుల వివరాల ప్రకారం, రోజుకు రూ.2 వేల కూలీ ఇస్తామని చెప్పి పనికి పెట్టుకున్నారు. రెండో రోజు పని సమయంలో ఒకరి వద్ద డబ్బులు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేసి తీవ్రంగా కొట్టారని తెలిపారు. డబ్బులు తీసుకున్నామని ఒప్పించేందుకు ఒక్కొక్కరిని పిలిచి హింసించారని, రైలు పట్టాలపై పడుకోబెట్టి బెదిరించారని చెప్పారు. ఒకరి తలను లారీ టైరు కింద పెట్టి బెదిరింపులకు గురిచేశారని వాపోయారు. చివరకు వీడియో తీసి గజ దొంగలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో మానసిక వేదనకు గురయ్యామని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పమిడిముక్కల సర్కిల్ సీఐ వై.చిట్టిబాబు, ఎస్సై కిషోర్ పాల్గొన్నారు.
