దక్షిణ స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కార్డోబా ప్రావిన్స్‌లోని ఆడముజ్ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొనడంతో పెను విషాదం చోటుచేసుకుంది. మాలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పైకి దూసుకెళ్లగా, ఎదురుగా వస్తున్న మాడ్రిడ్–హుయెల్వా రైలును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రయాణికులు మృతి చెందగా, 73 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెండు రైళ్లలో కలిపి సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పగా, ఒక బోగీ నాలుగు మీటర్ల లోతున్న వాలులోకి పడిపోయింది. రైళ్ల వేగం అధికంగా ఉండటంతో ఢీ తీవ్రత భారీగా నమోదైంది.
అండలూసియా ప్రాంతీయ ఆరోగ్య మంత్రి ఆంటోనియో సాన్జ్ మాట్లాడుతూ, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గాయపడిన వారిని ఆరు వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ స్పానిష్ సైనిక అత్యవసర బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. స్థానికులు ఆహారం, నీరు, దుప్పట్లు అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. రెడ్ క్రాస్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంది.
ఈ ఘటనపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్–అండలూసియా మధ్య రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం రైళ్లు నడిచే అవకాశం లేదని స్పష్టం చేశారు.
