ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు భారీ శుభవార్తలు ప్రకటించారు. ఉగాది పండుగ నాటికి రెండు కీలక పథకాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. కొత్త అన్న క్యాంటీన్ల ప్రారంభంతో పాటు పేదలకు నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మార్చి 19 ఉగాది రోజున గ్రామీణ ప్రాంతాల్లో 700 కొత్త అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు పట్టణాలు, నగరాలకు పరిమితమైన అన్న క్యాంటీన్లు ఇకపై మండల కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. కేవలం రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ అందించే ఈ పథకం కూలీలు, పేదలకు ఎంతో ఉపయోగపడనుంది.
అలాగే అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యమని చెప్పారు. ఎన్టీఆర్ స్పూర్తితో పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
