సంక్రాంతి పండుగ వేళ సరదాగా మొదలైన ఓ పందెం అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదానికి దారి తీసింది. ఎవరు ఎక్కువ మద్యం తాగుతారన్న చిన్నపాటి పోటీ చివరకు ఇద్దరు యువకుల ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నకిలీ మద్యం కారణమన్న పుకార్లు విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు స్పష్టత ఇచ్చారు.
పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలం బండవడ్డీపల్లికి చెందిన ఆరుగురు యువకులు పండుగ సందర్భంగా కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఆవలకుంట మణికుమార్, వేముల పుష్పరాజ్ మధ్య పందెం కుదిరింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కేవలం నాలుగున్నర గంటల్లోనే ఇద్దరూ కలిసి 19 బీర్లు తాగినట్లు తెలుస్తోంది. భారీగా ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లడంతో తీవ్ర డీహైడ్రేషన్‌కు గురైన వారు అస్వస్థతకు లోనయ్యారు.
ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మృతి చెందగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అదే పార్టీలో ఉన్న మరో నలుగురు యువకులు మద్యం పరిమితంగా తీసుకోవడంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ ఘటన నకిలీ మద్యం వల్ల కాదని, అతిగా మద్యం సేవించడమే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు మద్యం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు.
