తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్: మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాలలో ఘనంగా నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు

పాదయాత్ర, రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాలు

నంద్యాల, జనవరి 18:
( ఎల్లో సింగం ప్రతినిధి )

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు నంద్యాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు పార్టీ శ్రేణులతో కలిసి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగువారికి ఒక గుర్తింపును, ఆత్మగౌరవాన్ని అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాలాంటి సామాన్య మైనార్టీ బిడ్డకు రాజకీయాల్లో గుర్తింపునిచ్చి, మంత్రిని చేసి, ఈ స్థాయిలో నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ గారు అని. ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్లే నేడు నేను మీ ముందు ఈ హోదాలో ఉన్నానన్నారు. రూ.2 కే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాల వంటి పథకాలతో పేదవాడి ఆకలి తీర్చిన అపర దానకర్ణుడు ఎన్టీఆర్ అని అన్నారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లని నమ్మి పాలన సాగించిన యుగపురుషుడు అని. ఎన్టీఆర్ గారు కన్న కలలను నిజం చేసే దిశగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఆశయాలే ఈ ప్రభుత్వానికి దిక్సూచి.” అని కొనియాడారు. అనంతరం వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. యువత మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న రోగులకు మరియు పేద ప్రజలకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి ఫరూక్ స్వయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి, పేదలకు భోజనం వడ్డించారు.

ఈ కార్యక్రమాల్లో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, జిల్లెల్ల శ్రీరాములు, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, డాక్టర్ రవికృష్ణ, గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి, నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి మరియు వార్డు, గ్రామ ఇంచార్జి లు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe