నగదు బహుమతి అంటూ వచ్చే లింకులను నమ్మకండి: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

  • పొంగల్ గిఫ్ట్ వోచర్ల పేరిట సైబర్ నేరగాళ్ల సరికొత్త మాయాజాలం
  • లింక్ క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం
  • బాధితులు వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వెల్లడి

చిట్వేల్, జనవరి 15: ఎల్లో సింగం ప్రతినిధి

సంక్రాంతి పండుగ వేళ ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారని, వారి ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టపోవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా “ఫోన్ పే ద్వారా మీకు 5,000 రూపాయల నగదు బహుమతి వచ్చింది” అంటూ సోషల్ మీడియాలో వస్తున్న లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

-ఆ లింక్ క్లిక్ చేస్తే మృత్యుపాశమే!

ఈ మోసపూరిత విధానంపై ఎస్పీ మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూపుల్లో “పొంగల్ గిఫ్ట్ వోచర్ క్లెయిమ్ చేయండి” లేదా “క్యాష్ బ్యాక్ రివార్డ్” పేరుతో వస్తున్న మెసేజ్‌లు వందకు వంద శాతం నకిలీవని స్పష్టం చేశారు. ఆ లింకులను క్లిక్ చేయడం ద్వారా నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేసి, సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తారని హెచ్చరించారు.

-యూపీఐ పిన్ అడిగితే అది మోసమే!

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ కావడానికి మీరు ఎప్పుడూ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా నగదు పంపిస్తామని చెబుతూ పిన్ ఎంటర్ చేయమని అడిగితే అది ఖచ్చితంగా మోసమని గ్రహించాలని ఎస్పీ తెలిపారు. రివార్డులు ఏవైనా ఉంటే నేరుగా అధికారిక యాప్‌లలోనే కనిపిస్తాయని, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రావని స్పష్టం చేశారు.గోల్డెన్ అవర్ లోపే స్పందించండి పొరపాటున ఎవరైనా ఇటువంటి లింకులు క్లిక్ చేసి నగదు నష్టపోయినట్లయితే, వెంటనే మొదటి గంటలోనే స్పందించడం ద్వారా సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. బాధితులు తక్షణమే 1930 అనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.”మీ అప్రమత్తతే మీ సొమ్ముకు రక్ష. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేసి వారిని ఇబ్బందుల్లోకి నెట్టవద్దు” అని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe