భోగభాగ్యాలు భోగి – మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తొలి పండుగ

ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. ముచ్చటగా మూడు రోజుల పాటు కొనసాగే ఈ పండుగ సంబరాల్లో తొలి రోజును భోగి పండుగగా పిలుస్తారు. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ భోగి పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం ప్రారంభానికి ముందు చలి తీవ్రంగా ఉండటంతో, ఆ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు వేయడం ఆనవాయితీగా మారింది. ఈ చలి మంటల నుంచే ‘భోగి’ అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. ఈ రోజుతో ధనుర్మాసం కూడా ముగుస్తుంది.

సంక్రాంతి రాగానే ప్రతి ఇల్లు పండుగ కళను సంతరించుకుంటుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, కోడి పందాలు తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడిని పెంచుతాయి. భోగి మంటను సామాన్యమైన అగ్నిగా కాకుండా అగ్నిహోత్రంగా భావిస్తారు. మంటలు చల్లారిన తర్వాత ఆ భస్మాన్ని పిల్లల నుదుటి మీద నామం పెట్టడం సంప్రదాయం. పెద్దగా కాకపోయినా చిన్నగా అయినా భోగి మంట వేయడం ఎంతో శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.

భోగి రోజే పట్టిల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం మంచిదిగా భావిస్తారు. గోదా కళ్యాణాలను దర్శించడం, తిరుప్పావై పాశురాలు పఠించడం, పిల్లలకు భోగి పళ్లు పోయడం ఈ పండుగ ప్రత్యేకత. గోదాదేవి విష్ణుమూర్తిలో ఐక్యమైన రోజుగా భావించి ఈ పండుగకు భోగి అనే పేరు వచ్చిందని పురాణ విశ్వాసం.

WhatsApp Join Now
Youtube Subscribe