అక్రమ జూదాలపై పోలీసుల ఉక్కుపాదం – సంక్రాంతి వేళ కోడిపందాలు, పేకాటకు చెక్

సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని జరుగుతున్న అక్రమ జూద కార్యకలాపాలపై కోడూరు రూరల్ సర్కిల్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. పండుగ ముసుగులో నిర్వహించే కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాసులు స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, అవసరమైతే కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్రమ జూదాల నివారణలో భాగంగా చిట్వేలు, ఓబుళవారిపల్లి, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రతి మండలానికి మూడు ప్రత్యేక పోలీసు బృందాలను కేటాయించి, నిరంతర గస్తీతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కోడిపందాలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

పండుగ అనేది ఆనందం, సంప్రదాయాలకు ప్రతీక కావాలని, అక్రమ మార్గాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీఐ పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుతూ, అక్రమ జూదాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల ముందస్తు చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe