చిత్తూరు జనవరి 11/ఎల్లోసింగం
ప్రజలకు చేరువ కానున్న మెరుగైన వైద్య సేవలు
చిత్తూరు పార్లమెంటుకు మంజూరైన 249 కొత్త గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు
63.692 కోట్ల వ్యయంతో ఆరోగ్య వసతులు, అభివృద్ధి పనులు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళకు లేఖ ద్వారా తెలియజేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి
మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు
నిరుపేదలకు సైతం మెరుగైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ.., దేశవ్యాప్తంగా గ్రామీణ వైద్య కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంతో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి 249 గ్రామీణ వైద్య కేంద్రాలు మంజూరయ్యాయి.
63.692 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఆరోగ్య వసతులు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఓ లేఖ ద్వారా తనకు తెలియజేసినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఇందులో విలేజ్ హెల్త్ క్లీనిక్- 249, బ్లాక్ పబ్లిక్ యూనిట్స్- 18, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు- 2, ఏకీకృత ప్రజారోగ్య కేంద్రాలు -1 మంజూరైనట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయమన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టబోయే గ్రామీణ ఆరోగ్య వైద్య కేంద్రాలు పేద ప్రజల పాలిట ఆరోగ్య సంజీవినిలా పనిచేస్తాయన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి పూనుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.
