వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్ర ఇరిగేషన్ & సివిల్ సప్లై శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి
అశ్వరావుపేటలో రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనం అభివృద్ధి కార్యక్రమాలకు ఘన శ్రీకారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం
అశ్వరావుపేట.రైతుసంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం రైతుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఇరిగేషన్ & సివిల్ సప్లై శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు స్పష్టం చేశారు.స్థానిక అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఫుడ్ స్టాల్ను మంత్రులు సందర్శించారు. అనంతరం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళన సభ (రైతు మేళ)లో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట శాసన సభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షత వహించగా,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటిడిఏ పిఓ బి. రాహుల్, జిల్లా స్థాయి ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పూజ్యులు ఎన్టీఆర్ దీవెనలతో అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కావడం చారిత్రాత్మకమని, గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సశ్యశ్యామలం చేయడం తన జీవిత కోరిక అని తెలిపారు.గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు డీపీఆర్‌లో చోటు లేకపోయిందని, ప్రస్తుత ప్రభుత్వంలో కెనాల్స్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.నాల్గో పంప్ హౌస్ నిర్మాణంతో దమ్మపేట,అశ్వరావుపేట మండలాలకు గోదావరి నీళ్లు అందనున్నాయని వెల్లడించారు.ఆయిల్ పామ్ సాగులో కోకో, జాజి, వక్క, మిరియం వంటి అంతర పంటల సాగుతో రైతులకు అదనపు లాభాలు లభిస్తాయని చెప్పారు. తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణకు ప్రభుత్వం పట్టుదలగా ఉందని, దీని ద్వారా రైతులకు మహర్దశ రానుందని పేర్కొన్నారు.సన్నకారు రైతులకు మేలు చేసేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు.2047 నాటికి వ్యవసాయ రంగం ద్వారా 470 బిలియన్ డాలర్ల వాటా సాధించడమే తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యమని వివరించారు.సీతారామ ప్రాజెక్టును భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులతో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగం
ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
వ్యవసాయానికి నీరే ప్రాణమని,గోదావరి జలాలను చివరి ఎకరానికి చేరేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నీటిపారుదల,వ్యవసాయం పరంగా దేశానికే ఆదర్శంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు . సీతారామ ప్రాజెక్టుతో పాటు అనుబంధ కాలువల నిర్మాణం ద్వారా రైతులకు శాశ్వత నీటి భరోసా కల్పిస్తామని తెలిపారు.సాగునీటి వసతులు పెరిగితేనే రైతుల ఆదాయం పెరుగుతుందని,అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖతో సమన్వయంతో పనిచేస్తామని అన్నారు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఈ సందర్భంగా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి,
బాలికల కోసం హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం,జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.అలాగే భూసార పరీక్షలు, మొక్కల విశ్లేషణకు ఉపయోగపడే ఆధునిక ప్రయోగశాలను ప్రారంభించి, సహజ వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, ఖర్చులు తగ్గించి ఉత్పాదకత పెంచుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.జారె ఆదినారాయణ వ్యాఖ్యలు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ
“రైతుసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతుల ఆదాయం పెరిగేలా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలను రైతులకు ఉపయోగపడే కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని తెలిపారు.అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు నేరుగా విని, వారి సూచనలపై స్పందిస్తూ ప్రభుత్వ పథకాలపై స్పష్టత కల్పించారు. ఈ రైతు మేళా రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిసింది.
