అట్టహాసంగా సాగిన బల్లా పల్లవి ప్రమాణస్వీకారోత్సవం
హాజరైన ఎమ్మెల్యేలు దగ్గుపాటి, సింధూరరెడ్డి, ఎంపీ అంబికా, టీసీ వరుణ్, పల్లె రఘునాథ్ రెడ్డి కూటమి పార్టీల నాయకులు
ఒక మహిళ ఏం చేస్తుందన్న దానికి సమాధానంగా నా పనితీరు ఉంటుంది..బల్లా పల్లవి
ఎమ్మెల్యే దగ్గుపాటి సహకారంతో నెంబర్-1 స్థానంలో నిలబెడుతా
మార్కెట్ యార్డ్ ను వైసీపీ వారు సర్వనాశనం చేశారన్న దగ్గుపాటి
10-15శాతం వృద్ధి రేటు చూపిస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న అనంతపురం మార్కెట్ యార్డు పీఠంపై తొలిసారిగా ఒక మహిళ కూర్చున్నారు. కూటమి ప్రభుత్వం బల్లాపల్లవి రూపంలో ఒక మహిళకు రైతులకు సేవ చేసే అవకాశాన్ని కల్పించింది. గురువారం ఛైర్ పర్సన్ బల్లా పల్లవితో పాటు ఇతర పాలక వర్గ ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. ముందుగా ఆమె తన ఇష్టదైవమైన శ్రీషిర్డిసాయినాథుని ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి వైస్ చైర్మన్ అర్షదుల్లా, పాలకవర్గంతో కలిసి అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని కలిశారు. ప్రమాణస్వీకారోత్సవం నేపథ్యంలో వారికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో నగరంలో మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డుకు వచ్చిన బల్లాపల్లవికి పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, పల్లె సింధూరరెడ్డి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, పార్టీ పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, బిజెపి రాష్ట్ర నాయకులు సందిరెడ్డి శ్రీనివాసులు, లలిత్ కుమార్, జనసేన నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, ఇతర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఛైర్ పర్సన్ గా బల్లా పల్లవి, వైస్ ఛైర్మన్ గా అర్షదుల్లాలతో పాటు ఇతర పాలనవర్గ సభ్యులు జాంబవంతుడు, బోయపాటి బాలప్ప, రూపనుగుడి రవికుమార్, దలవాయి మారెక్క, లక్ష్మీదేవి, పువ్వాడ లావణ్య, మంజుల, కంఠాదేవి, అవుకు విజయ్ కుమార్, పప్పూరి కృష్ణ, కొడకొండ్ల వెంకటేష్, లక్ష్మీ రమణమ్మ, శాంతి సుధలు ప్రమాణస్వీకారం చేశారు.
వైసీపీ వారు నాశనం చేశారు.. మేము నిలబెట్టి చూపిస్తాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో వ్యవసాయం, మార్కెట్లను సర్వనాశనం చేశారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 18నెలల కాలంలోనే వ్యవస్థల్ని గాడిలో పెట్టారన్నారు. రైతుల పక్షపాతిగా ఉంటూ అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అనంతపురం మార్కెట్ యార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందని.. కానీ దానిని వైసీపీ నాయకులు సర్వ నాశనం చేశారన్నారు. ఎక్కడా చిన్న అభివృద్ధి చేయకుండా సొంత ఆదాయమే చూసుకున్నారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంలో ఒక మహిళకు అవకాశం కల్పించామని.. కచ్చితంగా మార్కెట్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తామన్నారు. ఈ నూతన పాలక వర్గంలో 10 నుంచి 15శాతం వృద్ధి చూపిస్తామన్నారు. నూతన పాలక వర్గం బాధ్యతాయుతంగా పని చేయాలని ఆయన సూచించారు. రైతులకు సేవ చేసే అవకాశం మీకు ప్రభుత్వం కల్పించిందని.. మార్కెట్ లో రైతులకు అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు. పశువుల మార్కెట్ తో పాటు, చీనీ మార్కెట్ ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 18నెలల కాలంలో రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఎకరాకు కూడా డ్రిప్ ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు లక్ష హెక్టార్లకు పైగా డ్రిప్ ఇచ్చామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న ప్రతిసారి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. ఉల్లికి ధరలు పడిపోతే.. రైతులకు హెక్టారుకు రూ.50 వేల సాయం చేసిందన్నారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు 130కోట్ల రూపాయల సాయం చేసిందని వివరించారు. పొగాకు, కోకో, మామిడి రైతులకు కూడా నష్టపోకుండా ఆదుకుందన్నారు. గత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద ఐదేళ్లలో కేవలం 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వంలో ఈ 18 మాసాల్లోనే రూ.1170 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రైతులకు ఇచ్చామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతలుగా మొత్తం రూ.6,310 కోట్లు రైతులకు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో అనంతపురం జిల్లాలో పండ్ల ఆధారిత పరిశ్రమలు వస్తాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
మహిళ ఏం చేస్తుందన్న వారికి సమాధానంగా నా పనితీరు ఉంటుంది
ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ బల్లా పల్లవి మాట్లాడుతూ మహిళలకు మొదటి నుంచి ప్రధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. ఆ రోజు ఎన్టీఆర్ మహిళా కండెక్టర్లను తీసుకురావడం, ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే.. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళకు తొలిసారి స్పీకర్ గా అవకాశం కల్పించారన్నారు. ఇలా టీడీపీ ప్రతిసారి మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని.. ఇందులో భాగంగానే నాకు మార్కెట్ యార్డులో ఛైర్మన్ పదవిని తొలిసారి మహిళగా తనకు అవకాశం కల్పించారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నా తండ్రి సుబ్బానాయుడు పార్టీలో ఉన్నారన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయని అయినప్పటికీ నా భర్త బల్లా సురేష్ 2014సమయం నుంచి ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు భర్త సహకారం లేకుంటే ఏమీ సాధించలేనన్నారు. చాలా మంది మహిళకు మార్కెట్ యార్డ్ పదవి ఇస్తే ఏం చేస్తారన్నారని.. వారి సమాధానంగానే నా పనితీరు ఉంటుందన్నారు. తన తండ్రి రైతు అని ఆ కష్టం నాకు తెలుసునని.. రైతులను తన కుటుంబసభ్యులుగా భావిస్తూ వారికి సేవలందిస్తానన్నారు. గతంలో వైసీపీ నాయకులు మార్కెట్ యార్డును నాశనం చేశారని.. ఇక్కడున్న సవాళ్లను కచ్చితంగా ఎదుర్కొంటానన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి సహకారంతో సమస్యలను పరిష్కరించి.. మార్కెట్ ను నెంబర్-1 స్థానంలో నిలుపుతామన్నారు. పార్టీ అధిష్టానంతో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటికి ఎప్పటికీ రుణపడి ఉంటానని.. నాకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని బల్లా పల్లవి అన్నారు..
అనంతపురం మార్కెట్ యార్డుకు ఒక చరిత్ర ఉంది..ఎంపీ అంబికా
అనంతపురం మార్కెట్ యార్డుకు ఒక చరిత్ర ఉందని.. 19ఎకరాలు విస్తీర్ణంలో సువిశాలంగా ఏర్పాటు చేశారన్నారు. అనేక సంవత్సరాలుగా చీనీ విక్రయాలకు రాష్ట్రంలో మార్కెట్ కు 2వ స్థానం ఉందన్నారు. ప్రస్తుత పాలనవర్గంలో మార్కెట్ ఆదాయాన్ని పెంచడమే కాకుండా రైతులు మరిన్ని సేవలు అందుతాయన్నారు. రాష్ట్రంలో ఏ రకం పండు అయినా పండేది ఒక్క అనంతపురం జిల్లాలోనేనన్నారు. ఈ పంటల్ని మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో సమిష్టి కృషితో మార్కెట్ యార్డును ఉన్నతస్థానానికి తీసుకెళ్తామని ఎంపీ అంబికా తెలిపారు.
