- నర్సరీ మొక్కల రక్షణకు ‘ఆటోమేటిక్ సన్ సెట్ ప్యాడ్’ ఆవిష్కరణ
- స్టూడెంట్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన గాడి రిహాన్, షేక్ ముజాహిద్
చిట్వేలు, జనవరి 09: ఎల్లో సింగం ప్రతినిధి
చిట్వేలు మండల విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ ప్రాజెక్ట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి తమ పాఠశాలకు మరియు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. మండలంలోని పీ.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గాడి రిహాన్, షేక్ ముజాహిద్ రూపొందించిన ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
-అత్యుత్తమ ప్రాజెక్టుగా ఎంపిక
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్’లో వీరు ప్రదర్శించిన “ఆటోమేటిక్ సన్ సెట్ ప్యాడ్ ఫర్ నర్సరీ సప్లింగ్స్” ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా మొదటి 500 ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. తదుపరి దశలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకమైన ‘స్టూడెంట్ ఇన్నోవేటర్ ప్రోగ్రాం’కు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం గూడూరులోని ఆదిశంకరాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో అనుసంధానం చేయడం విశేషం.
-రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణ
గైడ్ టీచర్ ఏ. శివన్నారాయణ గౌడ్ గారి పర్యవేక్షణలో విద్యార్థులు ఈ పరికరాన్ని రూపొందించారు.
వేసవి తాపం నుండి టిష్యూ కల్చర్ అరటి, పప్పాయ మరియు పూల మొక్కలను కాపాడటానికి రైతులు పడే ఇబ్బందులను గమనించి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.
సాధారణంగా రైతులు ఈత మరియు తాటి మట్టలను కప్పి మొక్కలను కాపాడుతుంటారు, దానికి ప్రత్యామ్నాయంగా ఈ ‘ఆటోమేటిక్ సన్ సెట్ ప్యాడ్’ పనిచేస్తుంది.
-అభినందనల వెల్లువ
జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు కొనియాడారు. జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు కాజా మొయిద్దీన్, ఈశ్వరయ్య, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను మరియు గైడ్ టీచర్‌ను ఘనంగా అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు
