రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి: అయ్యన్న

నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయని, యువత రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. యువత తీసుకునే నిర్ణయాల్లో వేగం, దృఢత్వం ఉంటాయని, రాజకీయాలకు వారి భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆయన అన్నారు.

విజయవాడ కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం కేవీ రావు సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ కేంద్రంను డిప్యూటీ స్పీకర్ రాఘురామ కృష్ణరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం సిద్ధార్థ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ పి. వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ భద్రతపై నైపుణ్యం కలిగిన యువత అవసరం చాలా ఎక్కువగా ఉందని అయ్యన్న తెలిపారు. పోలీసు శాఖకు కూడా సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక శిక్షణ అవసరమని సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ ఫోరెన్సిక్ కేంద్రం ఏర్పాటు కావడం ఇదే తొలిసారిగా జరుగుతుండడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

ఈ కేంద్రానికి తన పేరు పెట్టడంపై కాకినాడ సీపోర్ట్స్ సీఎండీ కేవీ రావు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం ఏర్పాటు కోసం ఆయన రూ.1.36 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe