అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఓ ఇంట్లో భయానక నేరం జరిగింది. భర్తకు ఇష్టమైన బిర్యానీలో నిద్రమాత్రలు కలిపిన భార్య, అతడు మత్తులోకి వెళ్లిన తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి భర్తను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
ఈ నెల 18న రాత్రి మాధురి తన భర్త నాగరాజు కోసం బిర్యానీ వండుతూ అందులో సుమారు 20 నిద్రమాత్రల పొడిని కలిపింది. అతడు గాఢ నిద్రలోకి వెళ్లగానే ప్రియుడు గోపిని పిలిపించింది. గోపి నాగరాజు ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖాన్ని అదిమి ఊపిరాడకుండా చేసింది. హత్య అనంతరం గోపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే మాధురి మాత్రం ఏమి జరగనట్టు శవం పక్కనే కూర్చొని రాత్రంతా సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తూ గడిపినట్లు విచారణలో బయటపడింది. తెల్లవారుజామున భర్త గుండెపోటుతో చనిపోయాడని ఇరుగుపొరుగువారిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ గత గొడవలు, వివాహేతర సంబంధం కారణంగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నివేదికలో ఛాతీ ఎముకలు విరిగినట్లు, ఊపిరాడక మరణించినట్లు తేలడంతో మాధురి నేరాన్ని అంగీకరించింది.
