సిమ్యులేషన్‌ మ్యాచ్‌ తర్వాతే అతడికి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌

టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌, ఆసియా కప్‌ హీరో తిలక్‌ వర్మ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాస శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల శస్త్రచికిత్స అనంతరం ఫిట్‌నెస్‌ సాధించే దిశగా కృషి చేస్తున్న అతడు, ఈ రోజు (శుక్రవారం) అక్కడ నిర్వహించే సిమ్యులేషన్‌ మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ లభించిన వెంటనే భారత శిబిరంలో చేరనున్నాడు. పూర్తి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే ఫిబ్రవరి 3న ముంబయిలో టీమ్‌ఇండియాతో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది. కాగా, న్యూజిలాండ్‌ సిరీస్‌కు తిలక్‌ రాకపోవడంతో అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఇదే సమయంలో వెన్ను గాయంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన మయాంక్‌ అగర్వాల్‌ కూడా ఫిట్‌నెస్‌ సాధించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ వార్మప్‌ మ్యాచుల్లో ఇండియా ‘ఎ’ తరఫున అతడు మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌ 2024లో మంచి ప్రదర్శన కనబరిచిన మయాంక్‌, గాయం కారణంగా 2025 సీజన్‌లో రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ అతడిని 2026 సీజన్‌కు రిటైన్‌ చేసుకుంది.

అలాగే భుజం గాయం నుంచి కోలుకుంటున్న రియాన్‌ పరాగ్‌ ఈ రోజు సిమ్యులేషన్‌ మ్యాచ్‌ అనంతరం ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ పొందే అవకాశముంది. వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం త్వరలో సిమ్యులేషన్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో పక్కటెముకల గాయానికి గురైన అతడు, ఆ తర్వాతి రెండు వన్డేలు మరియు టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

WhatsApp Join Now
Youtube Subscribe