సత్రశాల మల్లన్న సేవలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి – సతీ సమేతంగా ప్రత్యేక పూజలు

సత్రశాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని సత్రశాలలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఆయన సతీమణి శోభారాణి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారితో పాటు అమ్మవారికి అభిషేకాలు, ఆర్చనలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మమేకమై ప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి వేళ ఆలయంలో భక్తిరస వాతావరణం నెలకొంది.

WhatsApp Join Now
Youtube Subscribe