విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో భక్తుల ఆకలి తీర్చే పవిత్ర సేవలో ఒక దాత తన ఉదారతను చాటుకున్నారు. “అన్నదానం మహాదానం” అన్న ఆర్యోక్తిని సార్థకం చేస్తూ, సింహాద్రి నాథుని నిత్య అన్నప్రసాద పథకానికి రూ.1,00,000/- విరాళాన్ని అందజేశారు.
విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన కె చంద్రశేఖర్ (ధర్మపత్నీ కె. మంజు) తమ పితృదేవతలు కరుమూరి రామమ్ మరియు రత్నావతి గార్ల జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని సమర్పించారు. స్వామివారి పట్ల ఉన్న అపార భక్తి భావంతో ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె వెంకటరావు గారికి దాత స్వయంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, స్వామివారిని దర్శించేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే ఈ మహత్తర పథకంలో పాలుపంచుకోవడం అత్యంత పుణ్యఫలమని దాతలను కొనియాడారు.
స్వామివారి దర్శనానంతరం ఆలయ మర్యాదల ప్రకారం దాతలను శేష వస్త్రాలతో సత్కరించి, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య దివ్య ప్రసాదాలు అందజేశారు. “సింహాద్రి అప్పన్న సేవలో భాగస్వామ్యం కావడం మా పూర్వజన్మ సుకృతం” అని దాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సింహాచల పుణ్యక్షేత్రంలో అన్నదాన సేవ నిరంతరం కొనసాగేందుకు ఇటువంటి దాతల సహకారం ఎంతో స్ఫూర్తిదాయకం. గోవింద నామస్మరణతో క్షేత్రమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో విరాజిల్లుతోంది.
