శ్రీశైలం, జనవరి,15,
( ఎల్లో సింగర్ ప్రతినిధి )
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు 15.01.2026 మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించింది.
ఆలయముందుభాగంలో గల గంగాధర మండపం ఈ పోటీలు ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం 38 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారు. స్థానికులే కాకుండా నంద్యాల, గుంటూరు, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఎ.వి. రమణ, శ్రీ దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీమతి జి. శ్రీదేవిలు పాల్గొన్నారు. అలాగేకార్యక్రమములో ఉపకార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పర్యవేక్షకులు కె. గిరిజామణి, టి. హిమబిందు, పి. దేవిక, డి. స్వర్ణలత, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సంపాదకులు డా. సి. అనిల్‌కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
కాగా ఈ ముగ్గులపోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయబడ్డాయి. అదేవిధంగా ఇరువురికి ప్రత్యేక బహుమతులు పొందారు.
కాగా పోటీలో పాల్గొన మహిళలందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, గాజులు, శ్రీఅమ్మవారి కుంకుమ, లడ్డు ప్రసాదాలు, దేవస్థానం క్యాలెండరు అందజేసి సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ఎంతో విశేషమన్నారు. లోకకల్యాణార్థం మకర సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మరియు మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా మన పండుగలలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.
ఇంకా వారు మాట్లాడుతూ మన భారతీయ సంప్రదాయంలో రంగువల్లులకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యంగా సంక్రాంతి ఆచరణలో ఈ రంగవల్లులకు మరింత ప్రాధాన్యత కల్పించబడిందన్నారు. మన పురాణాలలో పలుచోట్ల ఈ ముగ్గులు ప్రస్తావించబడ్డాయన్నారు. ముగ్గును శుభానికి, మంగళత్త్వానికి ప్రతీకగా భావిస్తారన్నారు. లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించే అంశాలలో ఇంటిముంగిట రంగవల్లులను తీర్చిదిద్దడం కూడా ఒకటన్నారు. అందుకే ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం ప్రతీఏటా సంక్రాంతి బ్రహ్మోత్సవాలసందర్భంగాసంక్రాంతిపర్వదినం రోజున ముగ్గుల పోటీలు నిర్వహిస్తోందన్నారు. గత సంవత్సరం వరకు ఈ ముగ్గుల పోటీలను దక్షిణమాడవీధిలో నిర్వహించడం జరుగుతుండేదని, అయితే మన సంప్రదాయం పట్ల భక్తులలో మరింతగా అవగాహన కల్పించాలనే భావనతో ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఈ ముగ్గులపోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి శ్రీ ఐ.ఎల్.ఎన్. చంద్రశేఖర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కడప జిల్లా వారు వ్యాఖ్యానాన్ని అందించారు
