వైసీపీ నాయకుల ప్రచారం …పిచ్చి పరాకాష్టకు చేరింది

గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్రాన్ని ఏడాదిలోనే రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం అక్కయ్యవసలులో, రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైసీపీ హయాంలో రీ–సర్వే పేరుతో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారని, అప్పటి ప్రభుత్వం జగన్ బొమ్మతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి వ్యవస్థను రాజకీయ ప్రచారానికి ఉపయోగించిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.రీ–సర్వే ప్రక్రియలో హద్దురాళ్ల ఏర్పాటు పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, హద్దురాళ్లపై కూడా ఫోటోలు ముద్రించి వైసీపీ నాయకుల ప్రచారం …పిచ్చి పరాకాష్టకు చేరిందని . ప్రభుత్వ పథకాలపై పేర్లు ముద్రించుకొని ప్రజాధనాన్ని స్వప్రయోజనాలకు వినియోగించారని మండిపడ్డారు.రిసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు 2.5 లక్షల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా పంపిణీ జరుగుతుందని తెలిపారు. కొత్త పాస్‌పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో పాటు QR కోడ్‌తో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సాంకేతికతతో ముద్రించామని చెప్పారు. రైతులు QR కోడ్ స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేస్తే ఉచితంగా సరిదిద్దుతూ కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకొని, భూసర్వే పూర్తైన తర్వాత పాస్‌పుస్తకాలను నేరుగా రైతుల ఇళ్లకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వంలో కార్యాలయాల్లో కూర్చుని భూ రికార్డులను తారుమారు చేయడంతో రైతులు, భూస్వాములు కార్యాలయాల చుట్టూ తిరిగి తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుతం మండల రెవెన్యూ అధికారి, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ స్థాయిలోనే భూ వివాదాలు పరిష్కరించే అధికారాలు కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రజలు ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడ్డారని, వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. జిల్లా కేంద్రంలో మీ భూమి మీ చేతికి కార్యక్రమంలో ద్వారా 4 వేలమంది రైతులకు, భూ యజమానులకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. అలాగే, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకు వ‌చ్చార‌ని అన్నారు. ప్రజలు ఇంటి నుంచే పౌర సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంద‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో టెక్క‌లి ఆర్టీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు, రెవిన్యూ అధికారులు, తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe