వైసిపి నాయకులు దేన్నైనా కల్తీ చేయగలరు

60లక్షల లీటర్ల కల్తీ నెయ్యి తిరుమల లడ్డులో వాడారంటే వీరిని ఏమనాలి

వైసీపీపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం

వెంకటేశ్వర స్వామి భక్తులకు వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

వైసిపి నాయకులకు అవకాశం ఇస్తే దేన్నైనా కల్తీ చేయగలరని… అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ అయ్యిందంటూ సిట్ బృందం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని..గతంలోనే చెప్పామన్నారు. ఆ రోజు అధికారముంది కాబట్టి అవన్నీ బయటకు రాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో లడ్డూని కల్తీ చేశారని మాట్లాడితే వారిపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ బృందం సమగ్రమైన దర్యాప్తు చేసి 60 లక్షల లీటర్లకు పైగా నెయ్యి కల్తీ అయిందని రిపోర్ట్ ఇచ్చిందన్నారు. దీనిపై వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పైగా సిట్ బృందం తమకేదో అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడమే కాకుండా తప్పు చేయలేదన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కనీసం చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో ‘నెయ్యి’ తయారు చేసి కోట్లాది లడ్డూలు సరఫరా చేశారన్నారు. నెయ్యి కల్తీ చేయలేదని.. స్వామివారికి ద్రోహం చేయలేదని ప్రమాణం చేయగలరా ? అని సవాల్ విసిరారు. ఈ కల్తీ కుంభకోణంలో రూ.235 కోట్ల స్వామివారి నిధుల దుర్వినియోగం చేసారని విమర్శలు చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe