రాప్తాడు నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో గట్టిగా స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా జీరో అవర్‌లో మాట్లాడిన ఆమె, అనంతపురం రూరల్ మరియు ఆత్మకూరు మండలాల్లో తీవ్రంగా పొంచి ఉన్న తాగునీటి ఇబ్బందులను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ రెండు మండలాల్లో సుమారు 50 గ్రామాలు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.
అనంతపురం రూరల్ మండలం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు ప్రస్తుత నీటి సరఫరా సరిపోవడం లేదని ఆమె వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద రూ.90 కోట్ల నిధులతో పీఏబిఆర్ (PABR) నుంచి తాగునీటి మెయిన్ పైప్‌లైన్, నిల్వ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టిందని గుర్తుచేశారు. మెయిన్ పైప్‌లైన్ అనంతపురం వరకు పూర్తయినప్పటికీ, మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
పెండింగ్ బిల్లులు మంజూరు కాకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే వేసవిలో తాగునీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, తక్షణమే బిల్లులు విడుదల చేసి మిగిలిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
హంద్రీనీవా నీరు అందని ప్రాంతాల్లో వెయ్యి అడుగుల బోర్లు వేసినా నీరు దొరకడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నీటి సమస్య గ్రామాలను గుర్తించి అత్యవసర చర్యలు చేపట్టాలని కోరుతూ సత్వర స్పందన కోరారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సునీత స్పష్టం చేశారు.
