శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రధాన శివాలయాలతో పాటు చిన్న, పెద్ద ఆలయాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు.
బందోబస్తులో భాగంగా నడవలేని, ఆరోగ్యం బాగోలేని వృద్ధులు, వికలాంగ భక్తుల కోసం పోలీస్ సేవాదళ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దర్శన క్యూలైన్‌లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, ఆలయ పరిసరాల్లో సేవాదళ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి సహాయం అందిస్తున్నారు. వీల్‌చైర్లు అందించడం, అవసరమైన చోట భుజాన తోడ్పాటు, ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి దారి చూపించడం వంటి సేవలు అందిస్తున్నారు. చిన్నపిల్లల అవసరాలను గుర్తించి త్రాగునీరు, మార్గదర్శనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అదేవిధంగా పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు భద్రతా సూచనలు అందిస్తున్నారు. హెల్మెట్ వినియోగం, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తుపదార్థాల అనర్థాలు వంటి అంశాలపై ఆడియో సందేశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జనసమ్మర్థం, పార్కింగ్ ప్రదేశాలు, క్యూలైన్‌ల వద్ద ప్రజలకు దిక్సూచిగా వ్యవహరిస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగం సేవలు కొనసాగిస్తోంది.
