సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం విజయవాడలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు మరియు క్రీడా నిర్వాహకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా అసోసియేషన్ అధ్యక్షులు, ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ హాజరయ్యారు.
సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అసోసియేషన్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాబోయే రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీల నిర్వహణ, క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ సదుపాయాలు కల్పించడం, కోచ్‌లకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాల వారీగా క్రీడా శిబిరాలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
