లింగ సమానత్వం ఇంటి నుంచే మొదలవాలి – న్యూఢిల్లీలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పిలుపు

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ న్యూఢిల్లీలో నిర్వహించిన ముఖ్యమైన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. “ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ది బహాయీస్ ఆఫ్ ఇండియా” ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో పలువురు పార్లమెంట్ సభ్యులు, ఆలోచనాపరులు పాల్గొని లింగ సమానత్వంపై విస్తృతంగా చర్చించారు.

“లింగ సమానత్వం కోసం కార్యాచరణ: ఇంటి నుంచే ప్రారంభం” అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సమానత్వ భావనను సమాజంలో బలపరచాలంటే అది ప్రతి కుటుంబంలోనే ఆచరణలోకి రావాలని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో కుటుంబాల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల పెంపకం దశలోనే సమానత్వ విలువలను బోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సమాజంలో సుస్థిర మార్పు కోసం మహిళా సాధికారత, పరస్పర గౌరవం, సమాన అవకాశాలు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్చలు ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా విధానాల రూపకల్పనకు కూడా దోహదపడతాయని తెలిపారు. సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.

WhatsApp Join Now
Youtube Subscribe