రైతుల పాసుపుస్తకాలపై నీ ఫోటో ఎలా వేసుకుంటావ్ జగన్ రెడ్డి అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీ వేదికగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల్ని భయాందోళనకు గురి చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మరోసారి ప్రజా సమస్యలపై తన వాణి వినిపించారు.
వైసీపీ పాలనలో విద్యుత్ రంగ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్న సునీత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మిగులు విద్యుత్తుతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గాయని అన్నారు. ఈ బడ్జెట్‌లో సుమారు రూ.14 వేల కోట్ల కేటాయింపును స్వాగతించారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, సోమలదొడ్డి, బండమీదపల్లి, మన్నీల, ఆలమూరు, వేపకుంట, దాదులూరు, న్యామద్దల గ్రామాల్లో కొత్త సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరారు.
ఇప్పటికే దరఖాస్తు చేసిన 1500 మంది రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు, అవసరమైన మెటీరియల్, 100 కిలోమీటర్ల కేబుల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో విద్యుత్ సిబ్బంది కొరత ఉందని, లైన్‌మెన్లు, ఏఈలను నియమించాలని కోరారు. లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
రెవెన్యూ శాఖకు రూ.3868 కోట్ల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భూమి రైతు భవిష్యత్తు అని పేర్కొన్న సునీత, గత పాలనలో భూముల రికార్డులు గందరగోళంగా మారాయని విమర్శించారు. రైతు పాసుపుస్తకాలపై రాజకీయ నేతల ఫోటోలు ముద్రించడం పరిపాలనా అహంకారమని అన్నారు.
రీ-సర్వేలో భారీ లోపాలు బయటపడ్డాయని, గ్రామసభల్లో లక్షలాది ఫిర్యాదులు రావడం గత పాలన వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సర్వే రాళ్లపై బొమ్మలు, పత్రాలపై ఫోటోలకు భారీగా ఖర్చు చేయడం ప్రజాధన దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితులను సరిచేసారని, ఇది రైతుల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రభుత్వం అని సునీత వ్యాఖ్యానించారు.
