విజయవాడ
ఆంధ్రప్రదేశ్ పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 12 రోజుల పాటు నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ రూరల్ నిడమనూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ, పశువర్ధక శాఖ మంత్రి అచ్చన్నాయుడు, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఈ శిబిరాలను ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ శిబిరాల్లో పశువులకు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధి నిర్ధారణ, టీకాల పంపిణీతో పాటు శాస్త్రీయ పశు పోషణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో 60 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉన్నారని, ముఖ్యంగా వేలాది మంది మహిళలు పశుపోషణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాడి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి సారించి ఆగిపోయిన పథకాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చెల్లించని రూ.150 కోట్ల పశువుల ఇన్సూరెన్స్ బకాయిలను తమ ప్రభుత్వం విడుదల చేసిందని, ప్రస్తుతం పశువులకు మూడేళ్ల ఇన్సూరెన్స్‌తో పాటు 50 శాతం సబ్సిడీపై దాణా అందిస్తున్నామని చెప్పారు. అలాగే, అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులకు పునర్వైభవం తీసుకువస్తామని, ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది నియామకంపై త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రహరీ కి వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించి ఎమ్మెల్యే యార్లగడ్డ తో కలసి శంకుస్థాపన చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో పశుపోషణ రంగం అత్యంత కీలకంగా ఉందని, ముఖ్యంగా యాదవ సోదరుల జనాభా అధికంగా ఉండటం వల్ల రాష్ట్రంలోనే ఇక్కడ పశువుల సంఖ్య ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాల కేంద్రాల స్థాపన ద్వారా పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించిన మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం సేవలను ఆయన స్మరించుకున్నారు. అయితే, ప్రస్తుతం గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల దుస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రహరీ గోడలు కూడా లేని ఆ కళాశాల అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేయాలని మంత్రి అచ్చన్నాయుడికి విజ్ఞప్తి చేశారు. తాను స్వతహాగా పశుప్రేమికుడినని, ఎన్నో తరాలుగా ఒంగోలు జాతి ఆవులను సాగు చేస్తున్నానని చెబుతూ.. ప్రస్తుతం ఈ విశిష్ట జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా బ్రెజిల్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థను మార్చిన మన ఒంగోలు జాతి గిత్తలు, మన రాష్ట్రంలో మాత్రం కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయని అన్నారు. ట్రాక్టర్ల వాడకం పెరగడం, పాలు తక్కువ ఇస్తాయనే నెపంతో ఈ ఆవులను అమ్ముతుండటం వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. ఒంగోలు జాతిని కాపాడుకోవడానికి కర్ణాటక, రాజస్థాన్ తరహాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని పశువుల సంరక్షణకు కేటాయించాలని మంత్రిని కోరారు. ఒంగోలు జాతి ఆవులు బంగ్లాదేశ్ వంటి దేశాలకు అక్రమంగా రవాణా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ జాతిని కాపాడితే పశుపోషణ రంగ చరిత్రలో అచ్చన్నాయుడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, టిడిపి నాయకులు గొడ్డళ్ల చిన్న రామారావు, బండి వెంకట్రావు (నాని), దయాల రాజేశ్వరరావు, గూడపాటి తులసి మోహన్, కోనేరు నాగేంద్ర కుమార్, గుజ్జర్లపూడి బాబురావు, మూల్పూరి సాయి కళ్యాణి, ఆళ్ల వెంకట గోపాలకృష్ణా రావు, వేగిరెడ్డి పాపారావు, గరిమెళ్ళ నరేంద్ర, మొవ్వ వెంకటేశ్వరరావు, బొప్పన హరికృష్ణ, చింతల అప్పారావు, పొదిలి లలిత, మేడేపల్లి రమ, పరుచూరి నరేష్, నెక్కంటి శ్రీదేవి, దాసరి మహేష్, బొమ్మ సామి అరుణకుమారి, నబిగాని కొండయ్య, అద్దేపల్లి సాంబశివ నాగరాజు, అడుసుమిల్లి నవీన్, కానూరు యుగంధర్, కొల్లా ఆనంద్, పుట్టా సురేష్, మొవ్వ వేణుగోపాల్, గండికోట సీతయ్య, తుపాకుల శివలీల, సర్నాల బాలాజీ, చాగంటిపాటి వెంకటకృష్ణ, కొమ్మారెడ్డి రాజేష్, మోర్ల నాగబాబు, నిమ్మకూరు మధు, షేక్ కరీముల్లా, కోనేరు సుభాకర్, మాదల నాని, జాస్తి భూపతి, పాలడుగు రత్నాకర్ రావు, కొణతం పోతురాజు, మణిమాల వెంకట అప్పారావు, పడమట రంగారావు, బిజెపి నాయకులు కురుమద్దాలి ఫణి కుమార్, కానూరి శేషు మాధవి, నాదెండ్ల మోహన్, ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి, జనసేన పార్టీ నాయకులు పొదిలి దుర్గారావు, మేకల స్వాతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం – నిడమనూరులో ప్రారంభించిన మంత్రి అచ్చన్నాయుడు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
20
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
