మెట్ట ప్రాంతానికి ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించండి

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు గారి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

నెల్లూరు, ఫిబ్రవరి 3 :ఎల్లో సింగం ప్రతినిధి

మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు దృష్టికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తీసుకువెళ్లారు.
మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావుతో పాటు సభ్యులు మద్దిపాటి వెంకటరాజు, పాశం సునీల్‌కుమార్, వి.వి. సూర్యనారాయణరాజు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, అసిస్టెంట్ సెక్రటరీ భిక్షం, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు.
సమావేశంలో తొలుత జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ సంక్షేమ శాఖలు, డీఆర్‌డిఎ, మెప్మా, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తమ శాఖలకు సంబంధించిన బడ్జెట్ వినియోగంపై సమగ్రంగా వివరించగా, కమిటీ సభ్యులు చర్చించారు.సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, జిల్లాలో శాఖల వారీగా ఎంత బడ్జెట్ విడుదలైంది, ఎంత మేర ఖర్చు జరిగింది అనే అంశాలపై సమగ్రంగా కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. జిల్లాలో ఏ పథకానికి ఎక్కువ డిమాండ్ ఉందో గుర్తించి, ఆ పథకానికి అధికంగా నిధులు విడుదల అయ్యేలా ఎస్టిమేట్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
జిల్లా స్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ శాసనసభ వరకు చేరుతుందని, దాని ద్వారా జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు మరింత అవకాశం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వివరించారు.
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తమ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురవుతోందని, బడ్జెట్ కేటాయింపుల్లో ఉదయగిరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గండిపాలెం ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించి మెట్టప్రాంత రైతులకు అండగా నిలవాలని, సాగునీటి రంగ అభివృద్ధికి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్వో విజయ్ కుమార్, డిఆర్‌డిఎ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు నాగరాజకుమారి, గంగాభవాని, ఇరిగేషన్ ఎస్ఈ దేశ్‌నాయక్, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, మత్స్య, పశుసంవర్థక శాఖ జేడీలు రమేష్ నాయక్, శాంతి, డీఎంఅండ్ హెచ్‌వో సుజాతతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe