30 వార్డులలో 100 పనులు మంజూరయ్యాయి
అన్ని పనులు ఒకేసారి ప్రారంభిస్తాం
22వ వార్డు పర్యటనలో మాట్లాడిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
పార్వతీపురం మున్సిపాలిటీలో గల అన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం 22వ వార్డులో పర్యటించారు. ఉదయం 6 గంటలకే వార్డులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు తదితర సమస్యలతో పాటు మరికొన్ని కొత్త సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికి తెలుసని అన్నారు. వార్డులోని సమస్యలను గుర్తించడానికి ఈరోజు ఈ వార్డు పర్యటన చేయడం జరిగిందని, పాత సమస్యలతో పాటు మరికొన్ని కొత్త సమస్యలు నా దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీకి 100 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఈ పనులన్నింటికీ ఒకేసారి శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి వార్డులో పర్యటించి కొత్త సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. వార్డు పర్యటనలో నాతోపాటు మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, శానిటరీ అధికారులు, ఇతర విభాగాల అధికారులందరూ పర్యటించడం జరుగుతుందని, వార్డుల్లో గుర్తించిన సమస్యలన్నీ మార్చి నెలాఖరు లోపు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో మున్సిపాలిటీ నుంచి మెజార్టీ వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలందరికీ అండగా ఉంటుందని అన్నారు. అలాగే డంపింగ్ యార్డ్ ను కూడా తరలించడం జరుగుతుందని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని, అలా వేరు చేసే చెత్తను వీధుల్లోకి వచ్చే పారిశుధ్య కార్మికులకు అప్పగించాలని ప్రజలను సూచించారు. వీదుల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, ఆ విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిల్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
