ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ప్రధాన లక్ష్యమని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులు మరియు సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, బ్యాంకు రుణాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, కుటుంబ వివాదాలు, ట్రాఫిక్ మరియు పబ్లిక్ యుటిలిటీ కేసులు వంటి వివాదాలను ఇరు పక్షాల సమ్మతి ద్వారా పరిష్కరించనున్నట్లు చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజల సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను సఖ్యతతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండేలా న్యాయవ్యవస్థ కృషి కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమం ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె. సౌమ్య జాస్ఫిన్, న్యాయవాదులు శ్రీనివాస్, కృష్ణ, పోలీస్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
