మహాశివరాత్రి సందర్బంగా శైవ క్షేత్రాల్లో వైద్య శిబిరాలు – గుంప శిబిరాన్ని పరిశీలించిన డాక్టర్ జగన్ మోహన్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు భారీగా తరలివచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ప్రధాన క్షేత్రాలతో పాటు చిన్న, పెద్ద ఆలయాల వద్ద వైద్య శిబిరాలు, అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గుంపలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా ఎన్‌సీడీ అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్ రావు ఆదివారం సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.

శిబిరంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, భక్తులకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు, నమోదవుతున్న కేసుల వివరాలను వైద్య సిబ్బందితో చర్చించారు. అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్య పరికరాల లభ్యతను తనిఖీ చేసి, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా నిరంతరం అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని ఆదేశించారు.

అదేవిధంగా స్థానిక కమిటీ ఏర్పాటు చేసిన మైక్ మాధ్యమం ద్వారా భక్తులకు, నిర్వాహకులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఏ చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని, అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్ ప్రాంగణంలో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్. రమేష్, సర్పంచ్ సుంకరి సుగుణ, ఆలయ నిర్వాహకులు సి.హెచ్. వీరభద్రస్వామి, హెల్త్ ఈఓ నర్సింగరావు, సూపర్వైజర్ జయగౌడ్, కొమరాడ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe