👉 జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
👉 పారదర్శకంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
👉క్షేత్రస్థాయి అధికారులకు బొబ్బిలిలో ప్రత్యేక శిక్షణ
👉తప్పులు లేని పాస్ పుస్తకాల పంపిణీయే లక్ష్యం
బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, జిల్లాను వివాదరహితంగా తీర్చిదిద్దడమే యంత్రాంగం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. భూముల రీ-సర్వే ప్రక్రియలో దొర్లిన పొరపాట్లను సరిదిద్ది, రైతులకు భరోసా కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బొబ్బిలి కళాభారతిలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో జరిగిన సర్వే లోపాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను గమనంలో ఉంచుకుని, ఈసారి అత్యంత పారదర్శకంగా రికార్డులను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. “ప్రభుత్వం మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, రికార్డులను మనమే సరిదిద్దుకోవాలి. క్షేత్రస్థాయిలో వీఆర్వో, సర్వేయర్లు సంయుక్తంగా ప్రతి భూమిని పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి ఇ-కేవైసీ పూర్తి చేయాలి. వివరాలన్నీ నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రింటింగ్‌కు పంపాలని ఆయన తేల్చి చెప్పారు.జిల్లావ్యాప్తంగా మొదటి, రెండు దశల్లో ఇప్పటికే 499 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయి, పోర్టింగ్ జరిగిన 423 గ్రామాల్లో 2.03 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ గ్రామాలకు చెందిన పాస్ పుస్తకాల్లో పెద్ద ఎత్తున తప్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. అలాగే ఆ తరువాత జరిగిన రీసర్వే లో కూడా తప్పులు జరగడం శోచనీయమని పేర్కొన్నారు. సుమారు 8,015 పాస్ పుస్తకాలకు గాను, ఇంకా 3,896 పుస్తకాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. తప్పులు సరిదిద్ది ఫిబ్రవరి 10 లోగా పంపిణీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులన్నిటినీ సరిదిద్దాల్సిన గురుతర బాధ్యత ప్రస్తుతం రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. ఈ ప్రక్రియను ప్రహసనంలా కాకుండా, అంకితభావంతో పూర్తి చేసి, ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ మధ్య విడతల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పూర్తి చేయాలని సూచించారు. తప్పులు సరిదిద్దే ప్రక్రియలో పాటించాల్సిన ఆరు నిబంధనలను వివరించారు.ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను కలెక్టర్ వివరించారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని కోరారు. జిల్లాలో చాలా భూ సమస్యలకు కారణమైన జాయింట్ ఎల్పీఎంలను సరిదిద్దాలని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మాట్లాడుతూ పాత పాస్ పుస్తకాల్లో దాదాపు చాలా వరకు తప్పులు ఉన్నట్లు గుర్తించామన్నారు. తొలుత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది రికార్డులు రూపొందించాలని సూచించారు. తప్పులను సరిదిద్దే అవకాశాన్ని తాజాగా ప్రభుత్వం తహసీల్దార్లు కు, ఆర్డీవోలకు కల్పించిందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను పూర్తిగా పరిశీలించి, ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చే సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఇచ్చే పాస్ పుస్తకాల్లో ఒక్క తప్పు కూడా దొర్లకూడదని ఆదేశించారు. రెవెన్యూ రికార్డులను సవరించే బాధ్యతను పిపిటి ద్వారా జేసి వివరించారుఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం.రామ్మోహన్, సర్వే శాఖ ఏడి విజయకుమార్, బొబ్బిలి డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
