సంక్రాంతికి సొంతూళ్లకు వస్తున్న ప్రజలను పార్వతీపురం పట్టణంలోని రోడ్ల దుస్థితి తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. “సంక్రాంతికి వస్తున్నారా? అయితే పార్వతీపురం బైపాస్ రోడ్డులోని గోతులు తప్పకుండా చూడండి” అంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వంగల దాలినాయుడు ఎద్దేవా చేశారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్డును, పాత బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా దీప్తి లాడ్జింగ్ జంక్షన్ వరకు పూర్తిగా పాడైపోయిన రోడ్లను, ఫ్లైఓవర్‌పై ఏర్పడిన గోతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్రాంతికి రోడ్లు వేస్తామని పాలకులు, అధికారులు ప్రకటనలు చేసినా ఇప్పటికీ రెండు సంక్రాంతులు గడిచినా పరిస్థితి మారలేదన్నారు. రోడ్లపై పెద్దపెద్ద గోతుల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొత్త రోడ్లు వేయలేకపోయినా కనీసం గోతులు పూడ్చే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డే ఇలాంటి దుస్థితిలో ఉంటే పురపాలన పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా బైపాస్ రోడ్డు, మున్సిపల్ కార్యాలయ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
